Pages

Search This Blog

Saturday, September 26, 2026

Song

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే 
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే 
అణువణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి 
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

ప్రాణం ఎపుడు మొదలైందో  తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా 
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే 
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం 
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే 
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా 
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలైనీ
దరి చేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే 
అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే 
ఆ కాంతే నువు. వెతికే సంక్రాంతై ఎదురవదా

Monday, July 27, 2026

Song

చాటు చాటు చాటునుంచి చూడడాలు దేనికో
మాటు మాటు మాటులోనే దాచడాలు ఎందుకో
నాలోపలున్నదేది పెదవి దాటదేమిటో
నాకున్న ఆశ నీకు తెెలిపితే అదింకెటో
చాటు చాటు చాటునుంచి చూడడాలు దేనికో
మాటు మాటు మాటులోనే దాచడాలు ఎందుకో
నీ దారి వెంట నన్ను నడుపుతున్నదెవ్వడో
నా దారిలోకి నిన్ను మలచడం అదెప్పుడో

ఎపుడో తెలుసు ఈ నేలకి అపుడే తెలుసోయ్ ఆ గాలికి
విషయం తెలుసోయ్ గోదారికీ సలహా ఇవవే నీకెంతకీ
మాటకోసారి నీ పేరునే పలికినా చీమ కాటైనా లేదు నీ చెవులకి
పూటకోసారి నీ తీరునే తలిచినా చిన్న గాటైనా రాదు నీ మనసుకి
కాలం వెలుగులో లోకం తెలిపితే బతుకిలా గడిచిపోతుందే
మౌనం ముసుగులో ప్రా‌‌ణం పలికితే నిజమెలా అడుగు వేస్తాదే
నిన్ననో నేడనో రేపనో మాపనో గీత గీయాలి ఏనాటికో
ఔననో కాదనో ఉందనో లేదనో తేల్చుకోవాలిగా ఏదో నీతో

నీటినైనా ఆపుతాను దాహమాపలేనుగా
ఊపిరైనా ఆపుతాను ఊహనాపలేనుగా
మేఘాలు ఆపలేవు మెరుపుకున్న తొందర 
మౌనాలు ఆగమన్నా మనసు ఆగలేదురా

చాటు చాటు చాటునుంచి చూడడాలు దేనికో
మాటు మాటు మాటులోనే దాచడాలు ఎందుకో
కాలాలు ఆపలేవు క్షణముకున్న తొందర 
నా కళ్ళు ఆగమన్నా కలలు ఆగలేవురా

Movie: పురుషః
Music: శ్రవణ్ భరద్వాజ్ 
Singer: చిన్మయి శ్రీపాద

Saturday, March 02, 2024

Song

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా 
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని 

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా 
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు 
నమ్మనని నవ్వుకుని చాల్లే పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటి మైమరుపులో నను పోల్చుకుంటాననీ
తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని 

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా 
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం 
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం 
నువ్వు రాక ముందు జీవితం గురుతైన లేదని 
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదని
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని 
ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని 
నీకు చెప్పాలని 

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా 
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని 
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా 
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

Wednesday, November 22, 2023

Song

ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపన్నా
నీ కష్టంలో నేనూ ఉన్నాను కరిగే నీ కన్నీరౌతా నేను 
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి 
నీ ఏకాంతంలో  ఓదార్పౌతాను

కాలం ఏదో గాయం చేసింది నిన్నే మాయం చేశానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది శోకం కమ్మి జోకొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా 
ఆ జీవం నీవని సాక్ష్యం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిముషాలన్నీ నాలో మోగే గుండెల సవ్వడులే
అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగ
నువ్వే లేకుంటే నేనంటూ ఉండనుగా
నీ కష్టంలో నేనూ ఉన్నాను కరిగే నీ కన్నీరౌతా నేను 
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి 
నీ ఏకాంతంలో  ఓదార్పౌతాను
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

Monday, March 13, 2023

I was once a happy soul

Listening to maestro ilayaraja's songs in the evening reminded me of that. Wonder what happened.. why did I turn into this messy piece of whatever .. I want to get in touch with that self again.. meet him and be him again..

Monday, March 06, 2023

Song

నీ చూపులే నా ఊపిరి .. ఓసారిలా చూడే చెలీ
అమావాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి 
ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీ చూడవిలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా

రోజూ కొత్తగా నీ సందర్శనం .. ఆహా అన్నదీ నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం.. ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందీ ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే తూర్పు కానీ
నీ తలపులలో తలమునకవనీ ఎన్నో జన్మలనీ
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైనా జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా

నీతో బంధమే రాసిందెవ్వరో.. నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీవైపుగా లాగిందెవ్వరో.. నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లో పడి నిలిచానీ రాదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో 

||  నీ చూపులే ||